Friday, August 16, 2013

పాలు పంచదార...

పాలు పంచదార పాపర పండ్లలో
చాలబోసి వండ చవికి రాదు
కుటిల మానవులకు గుణమేల గల్గురా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చేదుగా ఉండే పాపర పండ్లలో  పాలు పంచదార వేసి వండితే తీయదనము రాదు కదా! అలాగే వంకర బుద్దిగల నీచులకు ఎన్ని గుణములు కరిపినను బుధ్ధిరాదు.

పాముకన్న...

పాముకన్న లేదు పాపిష్టి జీవంబు
అట్టి పాము చెప్పినట్లు వినును
ఖలును గుణము మానుపు ఘనులెవ్వరునులేరు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పామును మించిన విష జంతువు వేరొకటి లేదు. అలాంటి పాము మనిషి చెపినట్టు వింటుంది. కానీ, దుర్మార్గుడిని సజ్జనుడుగా మార్చుట చాలా కష్టము.

ఎలుకతోలు...

ఎలుకతోలు దెచ్చి యెన్నాళ్లు ఉతికినా
నలుపు నలుపే గాని తెలుపురాదు
కొమ్మబొమ్మ దెచ్చి కొట్టినా బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎలుక తోలును ఎంత సేపు ఉతికినా తెలుపు అవదు. మానవ గుణములను ఎంత ప్రయత్నము చేసినను మార్చలేము. అది ప్రాణము లేని కొయ్య బొమ్మను మాట్లాడమన్నట్లుగా ఉంటుంది.

వెన్న చేత...

వెన్న చేత బట్టి వివరంబు దెలియక
ఘృతము గోరునట్టి యతని భంగి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

వెన్న చేతిలో ఉంచుకొని నేయి కోసం వెతికినట్లు తానే దైవమని తెలిసి కూడా దైవాన్ని తలచుకుంటాడు.

మనసులోని...

మనసులోని ముక్తి మరియొక చోటను
వెదుక బోవువాడు వెర్రివాడు
గొర్రె చంకబెట్టి గొల్ల వెదికినట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని గొల్లవాడు వెతికినట్లు మోక్షం కోసం వెర్రి వాని వలె మనసుకు ఆవల వెదుకుతున్నాడు

మంటికుండవంటి...

మంటికుండవంటి మాయ సంసారంబు
చచ్చు నెన్నడైన జావదాత్మ
ఘటములెన్నియైన గగనంబె ఏకమే
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఈ సంసారం మట్టికుండ వంటిది. ఈ సంసారంలో భ్రమించే శరీరం చస్తుంది గాని ఆత్మచావదు. కుండలు వేరైనా అందులోని ఆకాశం ఒక్కటే.

భూమిలోన...

భూమిలోన బుట్టు భూసార మెల్లను
తనువులోన బుట్టు తత్వమెల్ల
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

భూమిలోన భూసారం పుట్టినట్లే, తనువులో తత్వం పుడుతుంది.అలాగే శ్రమము యొక్క ఫలితమంతా బ్రహ్మమనే తెలియాలి.

పేరు సోమయాజి...

పేరు సోమయాజి పెనుసింహ బలుడాయె
మేకపోతు బట్టి మెడను విరువ
కాని క్రతువు వలన కలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

యజ్ఞాలు చేసేవాడు సోమయాజి.యజ్ఞంలో మేక మెడను విరిచి చంపుతాడు. ఇలాంటి జీవహింస చేసే క్రతువు వల్ల మోక్షంబు కలుగుతుందా! 

దేవపూజలందు...

దేవపూజలందు దేవాలయములందు
దేవుడుంట జెప్పి తెరువు జూపి
తెలియ విశ్వమెల్ల దేవాదిదేవుడే
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పూజలు జరిగేచోట, దేవాలయాల్లో దేవుడు ఉన్నాడని చెబుతారు. విశ్వమంతటా ఆ దేవదేవుడు లేని చోటు లేదని తెలియరు.

తాము కన్నవారు...

తాము కన్నవారు, తము గన్నవారును
చచ్చుటెల్ల తమకు సాక్షిగాదె
బ్రతుకు టెల్ల తమకు బ్రహ్మకల్పంబులా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

తనను పుట్టించిన వాళ్లూ, తాను పుట్టించిన వాళ్లూ, చస్తూ ఉండడం చూస్తూ ఉన్నారు.మనుషులు కలకాలం జీవించగలమనే భ్రమను వదల కున్నారు.

తపము...

తపము జపములేల ధాత్రిజనులకెల్ల
ఒనర శివుని జూడ ఉపమగలదు
మనసు జెదరనీక మదిలోన జూడరో
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

జపాలు, తపాలు అవసరం లేదు. శివుణ్ణి చూసేందుకు ఉపాయం ఉంది. మనస్సును చెదరకుండా నిలిపి మనసులో చూపు నిలబెడితే చాలు.

తనువు...

తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప
ధనము ఎవరి సొమ్ము దాచుకొనగ
ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఈ శరీరం తనదని తెలిసి కూడా పోషించడమెందుకు? ధనం తన సొంతం కాదు అని తెలిసి కూడా దాచుకోవడమెందుకు? ప్ర్రాణం పోకుండా నిలబెట్టుకొనుటకు అది కూడా తన సొత్తు కాదు అని తెలియాలి.

జీవి జీవి...

జీవి జీవి జంపి జీవికి వేయగా
జీవి వలన నేమి చిక్కియుండె
జీవిహింసలకును చిక్కునా మోక్షంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

జీవిని చంపి తినడం కోసం, జీవిని చంపి దైవానికి నైవేద్యంగా పెడతారు. ఆ జీవిని చంపడంవల్ల ఏ ముక్తీ లభించదు. జీవిని హింసిస్తే మోక్షం రాదు.

చెమట కారునట్లు...

చెమట కారునట్లు శ్రమపెట్టి దేహంబు
గడన చేసి కూడు కుడువవలయు
తల్లిదండ్రి సొమ్ము తాదింట కారాదు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కష్టపడి, శ్రమించి సంపాదించిన సొమ్ముతో జీవించాలి. అంతేకానీ, తల్లిదండ్రులు కూడబెట్టిన్ సొమ్ము ఖర్చుచేసి జీవించడం తప్పు.

చెట్టుచేమ...

చెట్టుచేమ గొట్టి చుట్టు గోడలు బెట్టి
ఇట్టునట్టు పెద్ద యిల్లు గట్టి
మిట్టి పడును నరుడు మీది చేటెరుగక
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చెట్టూ, చేమా కొట్టి, గోడలు నిర్మించి పెద్ద యిల్లు కట్టి, ఇది తన ఇల్లు అని మనిషి మిడిసి పడతాడు. ఆ ఇంట్లో తానెంత కాలం ఉంటాడో తెలుసుకోలేడు.

చినుగు

చినుగు బట్టగాదు చీనాంబరము గాని
మురికి యొడలు గాదు ముక్తి గాని
పరమయోగి మహిమ పరికింప నరుడురా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పరమయోగి చిరిగిపోయిన బట్టలను కూడా, చీనాంబరముగా భావిస్తాడు. మురికి బట్టిన ఈ శరీరాన్ని ముక్తి సాధనంగా భావిస్తాడు.బాహ్య విషయాలు, వేషాలు యోగికి అవసరం లేదు.

చిత్తశుధ్ధి...

చిత్తశుధ్ధి గల్గి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ గాదు
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మర్రి విత్తనం చిన్నదైనా, అది మహావృక్షం అయినట్లు శుధ్ధమైన మనసుతో చేసిన ఉపకారం కొంచెమైనా అది తక్కువేమీ కాదు.

చంపదలచు...

చంపదలచు రాజు చనవగ్గలంబిచ్చు
చెఱుప నున్న పగర చెలిమిసేయు
కరవ నున్న పాము నెరిగాచుకొని యుండు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

రాజు చంపవలసిన వాళ్లతో చనువు అధికం చేస్తాడు. అలాగే చెఱపదలచుకొన్న శత్రువులతో చెలిమి అధికం చేస్తాడు. కాటు వేయాలు అనుకున్న పాము కాచుకొని ఉంటుంది కదా..!

గూబ చేర...

గూబ చేర గురము గునిసిపాడుగ బెట్టి
వెళ్లిపోదు రెంత వెర్రివారొ
గూబ గురము లేమి కూర్చురా కర్మంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

శకున పక్షి(గుడ్ల గూబ) ఇంటి మీద వాలితే  వెర్రివాళ్లు ఆ ఇంటిని కూల్చి వెళ్లిపోతుంటారు. గృహము లేకుండా పోయే కర్మకు ఆ పక్షిని నిందించడమెందుకు..?

కొంపలోన...

కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి
హృదయ మట్టె మిగుల పదిల పరచి
గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మనస్సును జాగృతం చేసి, శరీరంతో అనుభవించే కోరికలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకొని దైనందిన కార్యాలు చెస్తూ సంసార జీవితం సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకొన్నవాడు అవుతాడు.

Thursday, August 15, 2013

కులము...

కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు
సానుజాతమయ్యె సకల కులము
హెచ్చు తగ్గు మాట లెట్లెరుంగగవచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఏ కులం గొప్పదని, ఏ కులం తక్కువ అని గొడవలు అనవసరం. ఒకే కూటమి నుండి ఒకదాని తర్వాత మరొకటిగా ఈ కులాలు ఏర్పడ్డాయి.అందువల్ల ఏది గొప్పది అని తెలుసుకోవడం వీలుకాదు.

కర్మగుణములన్ని...

కర్మగుణములన్ని కడబెట్టి నడువక
తత్వమేల తనకు తగులు కొనును
నూనెలేను దివ్వె నువ్వుల మండునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చెడు కర్మలను, చెడు ఆలోచనలను తీసేసి నడవాలి. అప్పుడే తత్వం అంటుకొంటుంది. దీపం నూనెతో మండుతుంది గాని, నువ్వులతో మండదు.

ఒడ్డు పొడుగు...

ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన
దాన గుణము లేక దాత యగునె
ఎనుము గొప్పదైన ఏనుగు బోలునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎత్తూ, లావూ ఉండి, గడ్డం పొడుగ్గా ఉన్నంత మాత్రాన, దాన గుణం లేకుండా దాత కాలేడు. ఎంత పెద్ద గేదె అయినా, ఏనుగుతో సమానం కాలేదు. గేదె మూర్ఖమైనది, ఏనుగు తెలివైనది.


ఎరుకమాలు...

ఎరుకమాలు జీవి యెంతకాలంబుండి
చచ్చి పుట్టుచుండు సహజముగను
ఎరుక మరచుచోటు నెరుగుట బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

బ్రహ్మం గూర్చి తెలియని వాడు అనేక జన్మలు చస్తూ పుడుతూ ఉంటాడు. ఎరుకను కూడా మరిచి పోయే చోటు ఒకటుంది. అదియే బ్రహ్మం.

ఎరుక కన్నను...

ఎరుక కన్నను సుఖ మేలొకమున లేదు
యెరుక నెరుగ నెవని కెరుక లేదు
యెరుక సాటి యెరుక యెరుకయే తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎరుకను మించిన సుఖం ఏ లోకంలోనూ లేదు. అయినా ఆ యెరుకను తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవరికీ లేదు.ఎరుకకు సాటి యెరుక యెరుకయే. అదే తత్వం.

ఎన్ని తనువులైన...

ఎన్ని తనువులైన మృతికి నడ్డము గావు
మృతిని గెలువలేని యెరుకలేల
దొంగరీతి గాక దొరకునా మోక్షంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎన్ని శరీరాలైనా చావును తప్పించుకోలేడు.చావును గెలవలేని యెరుక వృథా. దొంగ ఇంటి ఇంటికీ దూరి వస్తూ ఉన్నట్లూ జీవుడు పుడుతూ గిడుతూ ఉంటాడు, కానీ మోక్షం మాత్రం దొరకదు.

ఉన్నతావు...

ఉన్నతావు వదలి ఊరూరు దిరిగిన
కన్నదేమి నరుడు గ్రాసమునకు
తన్నులోను జూడ తమమెల్ల వీడును
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఉన్నచోటు వదిలి తీర్థయాత్రలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. తనలో తాను చూసుకున్నట్లయితే అజ్ఞానం తొలగిపోతుంది.


ఉత్తముని...

ఉత్తముని కడుపున నోగు జన్మించిన
వాడు చెరచు వాని వంశమెల్ల
చెరకు వెన్ను బుట్టి చెరపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చెరుకుకు తుద వెన్నుపుట్టి చెరకులోని తీపిని నాశనం చేసినట్లు, మంచివాడికి మూర్ఖుడు పుట్టి వాడి వంశాన్నే చెరుస్తాడు.



ఇల్లు నాలి...

ఇల్లు నాలి విడచి ఇనుపకచ్చలు గట్టి
వంటకంబు నీటి వాంఛ లుడిగి
ఒంటినున్న యంత ఒదవునా తత్వంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఇల్లు విడిచి, భార్యను వదిలి, కామానికి గొళ్లెం వేసి, తిండి నీళ్లు మాని ఒంటరిగా ఉన్నంత మాత్రాన తత్వం అలవడదు.

ఇరుకు వచ్చు...

ఇరుకు వచ్చు వేళ ఈశ్వరు నెంతురు
కరుణ గనునె వట్టి గాసి గాక
సుఖము వచ్చు వేళ చూడంగ నొల్లరు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కష్టం వచ్చినప్పుడు తలచి, సుఖం వచ్చినప్పుడు మరిస్తే ఆ శివుడు కరుణించడు. సుఖ దుఃఖాలకు అతీతంగా మనస్సును నిలపాలి.

ఇచ్చువాని...

ఇచ్చువాని వద్ద ఈని వాడుండిన
చచ్చుగాని ఈవి సాగనీడు
కల్పతరువు కింద గచ్చ చెట్లున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

దాతవద్ద లోభి ఉంటే చావనైనా చస్తాడు గానీ, దానం సాగనీయడు. గచ్చపొద వున్న కల్పవృక్షం నీడకు ఎవరూ వెళ్లరు.

ఇంద్రియములు...

ఇంద్రియములు బట్టి ఈడ్చుచు నుండగా
వెర్రి మనుజుడేల వెదకు శివుని
ఇంద్రియముల రోసి ఈశుని జూడరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఇంద్రియాలు లాగుతూ ఉంటే వెర్రిమనిషి శివుని కోసం వెతకడం వీలుకాదు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని శివున్ని చూడాలి.

ఇంటిలోని...

ఇంటిలోని ధనము నీది నాది యనుచును
మంటిలోన దాచు మంకు జీవి
కొండబోడు వెంట గుల్లకా సైనను
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

తాను సంపాదించిన ఇంటిలోని ధనాన్ని తనదని అనుకుంటూ భూమిలో దాచిపెడతాడు. తాను చనిపోతున్నప్పుడు తనవెంట చిల్లిగవ్వ కూడా రాదని తెలియలేడు.

ఆశలుడుగ...

ఆశలుడుగ కన్న పాశముక్తుడు గాడు
ముక్తుడైనగాని మునియుగాడు
మునియునైతె గాని మోగంబులుడుగవు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఆశలుడిగితే బంధాలు తొలగిపోతాయి. బంధాలు తొలగితే ముని అవుతాడు. ముని అయిన వానికి మోహం తొలగిపోతుంది.

ఆశచేత...

ఆశచేత మనుజులాయువు గలనాళ్లు
తిరుగుచుందురు భ్రమ త్రిప్పలేక
మురికిభాండ మందు ముసరు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మురికి కుండలోని తిండికోసం ఈగలు ముసురు కొన్నట్లు, ఆయుష్శు ఉన్నన్ని రోజులు మనిషి ఆశతో తిరుగుతూ ఉంటాడు. భ్రాంతిని వదలలేడు.

ఆశకన్న...

ఆశకన్న దుఃఖ మతిశయంబుగ లేదు
చూపు నిలుపకున్న సుఖము లేదు
మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఆశ కంటే దుఃఖం వేరే లేదు. చూపు నిలిపితే సుఖం లభిస్తుంది. మనసు నిలిపితే ముక్తి లభిస్తుంది. అంటే మనసులోని కోరికలు అదుపులో ఉంచకుండా ముక్తి దొరకదు.

ఆలుసుతులు...

ఆలుసుతులు మాయ అన్నదమ్ములు మాయ
తల్లి తండ్రి మాయ  తాను మాయ
తెలియ నీదు మాయ దీనిల్లు పాడాయ
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

తెలిసిన వారికి భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు చివరికి తాను కూడా మాయే. ఈ శరీరం పాడుగాను, ఈ మాయ ఏమీ తెలుసుకోనీయదు.

ఆలి వంకవార...

ఆలి వంకవార లాత్మ బంధువు లైరి
తల్లి వంకవారు తగినపాటి
తండ్రి వంకవారు దాయాదు లైరయా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

భార్య వైపు వారు ఆత్మీయులు అవుతారు. తల్లి వైపు వారు అంతంత మాత్రమే. తండ్రి వైపు వారు పగవారు అవుతారు.


ఆత్మశుధ్ధి...

ఆత్మశుధ్ధి లేని ఆచార మదియేల
భాండ శుధ్ధి లేని పాకమేల
చిత్తశుధ్ధి లేని శివపూజ లేలరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఆత్మ శుధ్ధి లేని ఆచారాలు, కుండ శుధ్ధిలేని వంటకాలు ఎలా పనికిరావో, చిత్తశుధ్ధి లేని శివపూజలు కూడా ప్రయోజనం లేనివే!

ఆత్మలోన...

ఆత్మలోన శివుని అనువుగా శోధించి
నిశ్చలముగ భక్తి నిలిపె నేని
సర్వముక్తుడౌను సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

శరీరాన్ని, మనస్సును నిశ్చలంగా యోగసిధ్ధిలో నిలిపినపుడు మాత్రమే ముక్తి లభిస్తుంది. అప్పుడు, అందరిలో తనను, తనలో అందరినీ చూడగలడు.

Friday, August 9, 2013

అల్పబుధ్ధి...

అల్పబుధ్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డవారి నెల్ల తొలగ గొట్టు
చెప్పుదిన్న కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

నీచునికి అధికారమిస్తే గొప్పవాళ్లని తొలగిస్తాడు. చెప్పు రుచి మరిగిన కుక్కకు చెరుకు తీపి రుచించదు గదా..!!

అప్పులేని...

అప్పులేని వాడె అధిక సంపన్నుడు
తప్పులేని వాడు ధరను లేడు
గొప్పలేని బుధ్ధి కొంచెమై పోవురా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

అప్పు చేయనివాడె గొప్ప సంపద గలవాడు. తప్పు చేయని వాడు లోకంలో లేడు. అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమై పోతుంది.

అప్పు దూయరోత...

అప్పు దూయరోత హరిహరాదులకైన
మొప్పెతోడ మైత్రి మొదలె రోత
తప్పు బలుకరోత తాకట్టిడిన రోత
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

హరిహరాదులకైన అప్పు చేయడం రోత. తప్పు మాట్లాడ్డం రోత. తాకట్టు పెట్టడం రోత.

అన్నిదానములను...

అన్నిదానములను అన్నదానమె గొప్ప
కన్నవారి కంటె ఘనులు లేరు
ఎన్న గురువు కంటె ఎక్కువ లేరయా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

దానాలలోకెల్ల అన్నదానం గొప్పది.తల్లిదండ్రుల కంటె గొప్పవారు లేరు. అలాగే గురువును మించిన వారెవరూ లేరు.

అనువుగాని...

అనువుగాని చోట అధికుల మనరాదు
కొంచె ముండు టెల్ల కొదువ గాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

వీలుకాని చోట గొప్పవాళ్లం అని చెప్పుకోకూడదు. అక్కడ చిన్నతనం వచ్చినా అవమానమయిందని భావించనక్కర్లేదు. పెద్దదైన కొండ అద్దంలో కొంచెం గానే కనిపిస్తుంది గదా..!

Thursday, August 8, 2013

కూడు బెట్టకున్న...

కూడు బెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని
భక్షణంబు సేయు కుక్షి మలము
కూడు విడిచి మలము గుడుచురా ఉపవాసి
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పొట్టలోకి కూడు వేయకపోతే, అందులోని జఠరాగ్ని కడుపులోని మలాన్ని తింటుంది. ఉపవాసం ఉన్నవాడు కూడు వదలి మలం తినడం అవుతుందేగాని, తత్వం అలవడదు.


Sunday, August 4, 2013

కోపమునను...

కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడు గలుగు
కోప మడచె నేను కోరిక లీడేరు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కోపం వల్ల గొప్పదనం తగ్గిపోతుంది. కోపం వల్ల దు:ఖం తగ్గిపోతుంది. ఆ కోపాన్ని తగ్గించినపుడు మాత్రమే కోరికలు తీరుతాయి.

గంగిగోవు...

గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పవిత్రమైన గోవు పాలు గంటెడు చాలు. గాడిద పాలు కడివెడైనా వృథా! భక్తితో పెట్టిన అన్నం పట్టెడు చాలు.

Monday, July 29, 2013

తల్లితండ్రిమీద...

తల్లితండ్రిమీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పుట్టలో చెదలు పుడుతుంది, చస్తుంది. అదేవిధంగా కనిపెంచిన తల్లిదండ్రుల మీద కనికరం లేని కొడుకు పుట్టి లాభం లేదు, చచ్చి నష్టం లేదు.



తీర్పనార్ప లేని...

తీర్పనార్ప లేని తీర్పరి తనమేల
కూర్పవిప్ప లేని నేర్పరేల
పెట్టిపోయలేని వట్టిబీరము లేల
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

తీర్చలేని వాడు, ఆర్చలేని వాడు తీర్పరిగా ఉండకూడదు. కూర్చలేని వాడు, విప్పలేని వాడు నేర్పరి కాడు. దప్పిక తీర్చి కడుపు నింపని బీరాలు పనికి రావు.

Sunday, July 28, 2013

ధనము కూడబెట్టి...

ధనము కూడబెట్టి  ధర్మంబు చేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ గూర్చి తెరువరి కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న తేనెను ఎవడో దారిన పోయేవాడు తన్నుకు పోయినట్లు, కూడ బెట్టిన ధనాన్ని తినక పోయినా, ధర్మం చేయక పోయినా, ఆ ధనాన్ని ఎవడో ఒకడు దోచుకుంటాడు.


పట్టు పట్టరాదు...

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టి విడుట కన్న పడిచచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పట్టు పట్టకూడదు, పట్టిన తర్వాత విడవ కూడదు. గట్టి పట్టే పట్టాలి. పట్టి విడిచి పెట్టడం కంటే చావడం మేలు.

పసుల వన్నె...

పసుల వన్నె వేరు పా లేకవర్ణమౌ
పుష్ప జాతి వేరు పూజ యొకటి
దర్శనములు వేరు దైవంబు ఒక్కటి
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పశువులు ఏ రంగులో ఉన్నా పాలు మాత్రం ఒకే రంగులో ఉంటాయి.పూలు ఎన్ని రకాలైన పూజ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. దర్శనాలు ఎన్నైనా కనబడే దైవం ఒక్కడే.

పిండములను జేసి...

పిండములను జేసి పితరుల దలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పియ్యి దినెడు కాకి పితరు డెట్లాయెరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చచ్చిన తల్లిదండ్రులను తలచుకొంటూ కాకులకు పిండాలు పెడుతుంటారు. మలం తినే కాకి తల్లి గానీ, తండ్రి గానీ అవుతుందా..?

మాటలుడుగకున్న...

మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు
మంత్ర ముడుగకున్న మది కుదురదు
మనసు నిల్పకున్న మరి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మౌనంగా ఉంటే మంత్రం దొరుకుతుంది. ఆ మంత్రం ఉడిగితే మనసు కుదురుతుంది.మనసు కుదురుకోవడమే ముక్తి.

మేడిపండు...

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిరికి వాన్ మదిని బింకమీ లాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మేడిపండు పైకి చూడడానికి బంగారం లాగ నిగనిగ లాడుతుంది. డాని కడుపులో మాత్రం పురుగులు ఉంటాయి. పిరికి వాని మనసు కూడా పైకి గంభీరంగా ఉంటుంది.

మొండివాని...

మొండివాని కేల ముంజేతి కడియాలు
తొఱ్ఱివాని కేల కర్రపండ్లు
గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పిసినిగొట్టు చేతికి ముంజేతి కడియాలు, మాట తప్పేవానికి కర్ర పండ్లు, విద్యలేని వెర్రులకు గడ్డాలు, మీసాలు అవసరం లేదు.

మొదట నాసబెట్టి...

మొదట నాసబెట్టి తుద లేదు పొమ్మన
పరమ లోభులైన పాపులకును
వారియుసురు దాకి వగచెడి పోవరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఆశ పెట్టకూడదు, ఆ తర్వాత లేదు పొమ్మనకూడదు.అటువంటి పాపులు వాళ్ల ఉసురు తాకి చెడిపోతారు.

విడువ ముడువ...

విడువ ముడువ లేక కుడువగట్టగ లేక
వెరవు లేక విద్య నొరయలేక
వెడలలేని వాని నడపీను గందురు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఖర్చు చేయలేడు, దాచ లేడు, తిన లేడు, అనుభవించ లేడు. తెలివిగా చదువు గ్రహించలేడు. అట్టివాణ్ణి లోకం నడిచే పీనుగ అని అంటుంది.

Tuesday, July 23, 2013

వేరుపురుగు...

వేరుపురుగు చేరి వృక్షంబు చేరచు
చీడపురుగు జేరి చెట్టు చెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

వేరు పురుగు వృక్షాన్ని చెరుస్తుంది. చీడ చెట్టుని చెరుస్తుంది. అలాగే గుణవంతుడు నీచుడి సహచరం వల్ల చెడిపోతాడు.

Monday, July 22, 2013

వ్యాధి కలిగెనేని...

వ్యాధి కలిగెనేని వైద్యుని చేతను
మందు దినక కాని మాన దెందు
చెంత దీపమిడక చీకటి పాయునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

రోగం వస్తే వైద్యుడిచ్చిన మందు పుచ్చుకుంటేనే రోగం పోతుంది. చీకటి ముసురుకొన్నప్పుడు దీపం వెలిగించకుండా చీకటి పోదు కదా!

సుగుణవంతురాలు...

సుగుణవంతురాలు సుదతియై యుండిన
బుద్దిమంతులగుచు పుత్రులొప్ప
స్వర్గమేటి కయ్య సంసారి కింకను
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

భార్య సుగుణవంతురాలై, బిడ్డలు బుద్దిమంతులై ఉంటే సంసారికి ఇంక వేరే స్వర్గం అవసరం లేదు.

హీనగుణము...

హీనగుణము వాని నిలుసేర నిచ్చిన
ఎంత వాని కైన నిడుమ గలుగు
ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఈగ కడుపులోకి దూరితే కళకళం కలుగుతుంది. అలాగే నీచుణ్ణి ఇంట్లో చేరదీస్తే ఇబ్బంది కలుగుతుంది.

చదివి చదివి...

చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింక జదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!

ఓర్పు లేని...

ఓర్పు లేని భార్య యున్న ఫలంబేమి
బుద్ది లేని బిడ్డ పుట్టి యేమి
సద్గుణంబు లేని చదువది యేలరా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఓర్పు లేని భార్య వల్ల, బుద్ది లేని బిడ్డ వల్ల ఫలం లేదు. మంచి గుణాన్ని, వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే.

నీటిలోని...

నీటిలోని వ్రాత నిలువక యున్నట్లు
పాటిజగతి లేదు పరములేదు
మాటిమాటి కెల్ల మారును మూర్ఖుండు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మూర్ఖుని స్వభావం మాటిమాటికి మారిపోతూ ఉంటుంది. ఆది నీటి మీది వ్రాత వలె విలువ లేనిది.

Sunday, July 21, 2013

కనియు...

కనియు గానకుండు కదలింపడా నోరు
వినియు వినకయుండు విస్మయమున
సంపదగలవాని సన్నిపాతంబది
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చూచీ చూడనట్లు, వినీ విననట్లు, నోరు మెదపకుండా ధనవంతుడుంటాడు. అవి లోభితనమనే సన్నిపాత జ్వర లక్షణాలని తెలుసుకోలేడు.

కాశి నీళ్లు...

కాశి నీళ్లు మోసి కాళ్లు మొగము వాచి
ఎందు సుఖములేక ఎండి యెండి
చచ్చి వెనుక ముక్తి సాధింపగలరొకో
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కాశి లోని గంగ నీళ్లు రామేశ్వరానికి మోసి సముద్రంలో కలిపినంత మాత్రాన, కాళ్లు, మొహం వాయడం తప్ప, ఇహంలోను పరంలోను సుఖం దక్కదు.

కలిమినాడు...

కలిమినాడు నరుడు కానడు మదమున
లేమి నాడు పెట్ట లేదు మొదలె
కలిమి లేమి లేని కాలంబు కలుగునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

సంపద ఉన్నప్పుడు అహంకారంతో దానం చేయాలని తెలుసుకోలేడు. ఆ సంపద లేనప్పుడు దానం చేయాలని ఉన్నా మొదలు పెట్టడానికి అసలు లేదు. కలిమి లేములు మానసిక రుగ్మతలు అని తెలుసుకోలేడు.

కుండ కుంభమండ్రు...

కుండ కుంభమండ్రు కొండ పర్వత మండ్రు
ఉప్పు లవణమండ్రు ఒకటిగాదె
భాషలింతె వేరు పరతత్వ మొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కుండను కుంభమంటారు. కొండను పర్వతమంటారు. ఉప్పును లవణం అని కూడా అంటారు. భాషలు వేరు అయినప్పటికీ పరతత్వం ఒక్కటే.

కుక్క యేమెరుంగు...

కుక్క యేమెరుంగు గురులింగ జంగంబు
పిక్కబట్టి యొడిసి పీకుగాక
సంతపాక తొత్తు సన్యాసి నెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పిక్క బట్టి పీకడం మాత్రమే తెలిసిన కుక్క, జంగమ గురువును కూడా వదలదు. అలాగే సంతలో దారిగాచి సంపాదించే వేశ్య సన్యాసి వద్ద గూడ డబ్బులు గుంజడం మానదు.

కులములోన...

కులములోన నొకడు గుణవంతు డుండెనా
కులము వెలయు వాని గుణము వలన
వెలయు వనములోన మలయజంబున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

గంధపు చెట్టు వల్ల అది వున్న వనం ప్రకాశించినట్లు, ఒక్క గుణవంతుడి వల్ల అతడి కులం ప్రకాశిస్తుంది.

గంగ పారుచుండు...

గంగ పారుచుండు కదలను గతితోడ
మురికి కాల్వ పారు మోత తోడ
అధికు డోర్చునట్లు అధము డోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

గంగ ప్రశాంతంగా ప్రవహిస్తుంది. మురికి కాలువ శబ్దం చేస్తూ ప్రవహిస్తుంది. గొప్పవాడు ఓర్చుకోగలడు. కానీ, నీచునికి ఓర్పు ఉండదు.

చంపదగిన...

చంపదగిన యట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు జేసి పొమ్మనుటే చావు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చంప వలసినటువంటి శత్రువు మనకు దొరికినా వాన్ని చంపకూడదు. మంచి చేసి విడిచి పెడితే చాలు, అది వాడికి చావుతో సమానం.

చిప్పలోన...

చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీళ్ల గలిసె
ప్రాప్తమున్న చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చిప్పలోన పడిన చినుకు ముత్యం అవుతుంది. అదే నీళ్లలో పడిన చినుకు మాత్రం నీళ్లలొనే కలిసిపోతుంది. ప్రాప్తం ఉంటే ఫలితం తప్పకుండా లభిస్తుంది.

చేటు వచ్చెనేని...

చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు
మేలు వచ్చెనేని మెచ్చు తన్ను
చేటు మేలు తలప చేసిన కర్మముల్
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఏదైనా చెడు జరిగితే దైవాన్ని దూషిస్తారు.  మేలు కలిగితే తనని తాను మెచ్చుకుంటాడు. ఆ జరిగిన చెడు, మునుపు చేసిన పాప పుణ్యాల ఫలితాలని గ్రహించలేడు.

తనువు లస్థిరమని...

తనువు లస్థిరమని, ధనము లస్థిరమని
తెలుప గలడు దాను తెలియ లేడు
చెప్పవచ్చు పనులు చేయుట కష్టమౌ
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఈ దేహం శాశ్వతం కాదని, ఈ ధనం అశాశ్వతమని ఇతరులకు చెబుతాడు, కానీ, తాను తెలుసుకోలేడు.
ఎవరికైనా చెప్పడం సులువే, కానీ, చేయడమే కష్టం.


నీళ్లలోన మొసలి...

నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు
బయట కుక్క చేత భంగపడును
స్థానబలిమి గాని తన బలిమి గాదయా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మొసలి నీళ్లలో ఉన్నప్పుడు, ఏనుగునైనా పట్టుకొంటుంది. అదే, బయటకి వస్తే కుక్కకి బయపడుతుంది.
నీళ్లలో ఉన్నప్పుడు అది స్థానబలం అవుతుంది గాని తన బలం కాదు.

Saturday, July 20, 2013

పాల సాగరమున...

పాల సాగరమున పవ్వళించిన వాడు
గొల్లయిండ్ల పాలు గోర నేల
ఎదుటి వారి సొమ్ము లెల్లవారికి తీపి.
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

శ్రీ మహావిష్ణువు పాల సంద్రంలో పడుకుని ఉంటాడు; అయినా, ఆయన గొల్లవారి ఇళ్లల్లో పాలు, వెన్నలు దొంగిలించడం దేనికి? ఎదుటి వారి సొమ్ములు అంటే అందరికీ తీపే కదా.

విద్యలేని...

విద్యలేని వాడు విద్వాంసుల కడను
ఉండగానె పండితుడు గాడు
కొలని హంసలకడ కొక్కెర యున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పండితుల వద్ద ఉన్నంత మాత్రాన చదువులేని వాడు పండితుడు కాలేడు.
హంసలతో కలిసినంత మాత్రాన కొంగ కి గుర్తింపు రాదు.

పుత్తడి గల...

పుత్తడి గల వాని పుండు బాధయు గూడ
వసుధ లోన చాల వార్త కెక్కు
పేదవాని యింట పెండ్లైన నెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ధనవంతుడి పుండు కూడా ప్రపంచానికి వార్త అవుతుంది. పేదవాని ఇంట్లో పెండ్లి జరుగుతున్నా ఎవరూ పట్టించుకోరు. ప్రచారానికి ధనమే మూలం.

Friday, July 19, 2013

ముక్కుతాళ్ల...

ముక్కుతాళ్ల గ్రుచ్చి మురికి పోవగదోమి
కచ్చనీరు నించి కడిగి కడిగి
డొక్క దొలచినంత దొరకునా మోక్షంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ముక్కులో తాడు దూర్చి, కడుపు నిండా నీరు పోసి ఒళ్లు శుధ్ధి చేసుకుంటారు. అందువల్ల శరీరం శుధ్ధి అవుతుంది గానీ, మోక్షం సిధ్ధించదు.

Tuesday, July 16, 2013

మనసులోనె...

మనసులోనె పుట్టె మాయసంసారము
మనసు విరిగెనేని మాయ తొలగు
మనసు నిల్పెనేని మహి తానె బ్రహ్మము
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మనసునుంచే సంసారపు మాయ పుడుతుంది. మనసు విరిగి పోతే మాయ తొలగి పోతుంది. మనసు నిశ్చలముగ
పెట్టుకున్నవాడే బ్రహ్మము.

Sunday, July 14, 2013

పెక్కు జనుల...

పెక్కు జనుల గొట్టి పేదల వధియించి
డొక్కకొరకు నూళ్లు దొంగిలించి
ఎక్కడికిని బోవ ఎరిగి యముడు జంపు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎంతో మంది పేదల్ని కొట్టి చంపి, ఊళ్లు దోచుకుని, ఈ పొట్ట కోసం సంపాదించి ఎక్కడ దాక్కున్నా, యముడు జాడ తెలుసుకుని మరీ చంపుతాడు.

పదుగురాడు...

పదుగురాడు మాట పాటియై ధర జెల్లు
ఒక్కడాడు మాట ఎక్కదెందు
ఊరకుండు వాని నూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పదిమంది మాట్లాడిన మాట ఏదైనా చెల్లుతుంది. ఒక్కడు నిజం పలికితే అది చెల్లుబాటు అవ్వని కాలం ఇది.
ఊరకుండే వాడిని ఊరంతా కలిసినా ఏమీ చేయలేదు.

Wednesday, July 10, 2013

లోభివాని జంప...

లోభివాని జంప లోకంబు లోపల
మందు వలదు వేరు మతము గలదు
పైక మడిగినంత భగ్గున పడిచచ్చు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఈ లోకం లోపల పిసినారిని చంపడానికి వేరే మందు ఏమీ అవసరం లేదు, డబ్బు కావాలని అడిగితే సరి...
అట్టే చచ్చిపోతాడు.


రాతిబొమ్మ...


రాతిబొమ్మ కేల రంగైన వలువలు
గుళ్లు గోపురములు కుంభములును
కూడు గుడ్డ తాను గోరునా దైవంబు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

రాతి బొమ్మలకు వస్త్రాలు, గుడులు, గోపురాలు, నైవేద్యాలు అవసరం లేదు.
కూడు, గుడ్డ దేవుడు ఏమీ కోరుకోడు. అవన్నీ మనం కల్పించినవే...!

Monday, July 8, 2013

పందిపిల్ల...


పందిపిల్ల లీను పదియు నైదింటిని
కుంజరంబు ఈను కొదమ నొకటి
ఉత్తముడగు పురుషు డొక్కడు చాలడా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం

పంది ఒకేసారి పది నుండి పదిహేను పిల్లలను కంటుంది. ఏనుగు మాత్రం ఒక్క బిడ్డకే జన్మనిస్తుంది.
పంది పది పిల్లల కంటే ఒక్క ఏనుగు పిల్ల చాలు కదా!

నీళ్లలోని చేప...


నీళ్లలోని చేప నెరిమాంసమాశకు
గాలమందు చిక్కి కూలినట్లు
ఆశబుట్టి మనుజుడారీతి జెడిపోవు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చేప బయటి ఆహారం మీది ఆశతో గాలంలో చిక్కి మరణిస్తుంది. మనిషి కూడా ఆశ పెంచుకుంటూ చేపవలె చెడిపోతాడు.

Thursday, July 4, 2013

చిక్కియున్న వేళ...


చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్క కఱచి బాధపెట్టు
బలిమి లేని వేళ పంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

చిక్కిపోయి బలహీనంగా ఉన్నప్పుడు సింహాన్ని అయినా బక్క కుక్క కరిచి బాధిస్తుంది. అందువల్ల బలం లేని సమయంలో పంతాలకు పోవడం మంచిది కాదు.

Monday, July 1, 2013

గొడ్డుటావు బితుక...


గొడ్డుటావు బితుక గుండ గొంపోయిన
పళ్లనూడ దన్ను పాలనిడదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

గొడ్డుటావు వద్దకి పాలు పిండాలని కుండ తీసుకొని వెళ్తే, పాలివ్వదు సరికదా లాగి తంతుంది. అలాగే పిసినారిని
అడిగితే కూడా ఫలితం ఇలాగే ఉంటుంది.


కులము గలుగు...


కులము గలుగు వారు గోత్రంబు గల వారు
విద్య చేత విర్రవీగు వారు
పసిడి గల్గు వాని బానిస కొడుకులు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కులం, గోత్రం, విద్య ఉండి ఎంత గర్వించేవారయినా డబ్బున్న వారికి దాసులే సుమా...!!


Sunday, June 30, 2013

కుక్క గోవుగాదు...


కుక్క గోవుగాదు కుందేలు పులిగాదు
దోమ గజము గాదు దొడ్డదైన
లోభి దాత గాడు లోకంబు లోపల
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎంత గొప్పదైనను కుక్క సాదు జంతువైన ఆవు కాలేదు. భయపడి పరుగెత్తే కుందేలు పులి కాలేదు.
తొండం గల దోమ ఏనుగూ కాలేదు. అలాగే పిసినిగొట్టు దాత కాలేడు.


ఏమి గొంచు...


ఏమి గొంచు వచ్చె ఏమి తాగొనిపోవు
పుట్టు వేళ నరుడు గిట్టు వేళ
ధనము లెచటి కేగు తానెగు నెచటికి
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, తిరిగి వెళ్లేటప్పుడు ఏమీ తీసుకొని పోలేడు. వాడు సంపాదించిన 
ధనం ఎక్కడికి పోతుందో, వాడు ఎక్కడికి పోతాడో తెలియకున్నాడు.


ఎద్దుకైన గాని...


ఎద్దుకైన గాని యేడాది తెలిపిన
మాట తెలిసి నడచు మర్మమెరిగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఒక యేడాది నేర్పిస్తే ఎద్దు అయినా మనం చెప్పినట్లు తెలుసుకొని వ్యవసాయానికి పనికి వస్తుంది. కాని ముప్పై
యేండ్లు చెప్పినా మూర్ఖుడు తెలుసుకోలేడు.


Saturday, June 29, 2013

రాము డొకండు...


రాము డొకండు పుట్టి రవికుల మీడేర్చె
కురుపతి జనియించి కులము జెఱచె
ఇలను బుణ్యపాప మీలాగు కాదొక
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

శ్రీ రాముడు రఘు వంశానికి ఖ్యాతి తెచ్చాడు, కాని ధుర్యోధనుడి వల్ల కురువంశం నాశనమైపోయింది. ఇలలో పాప పుణ్యాలు ఇలా ఉంటాయి అని వీళ్లు నిరూపించారు.


మృగమదంబు జూడ...


మృగమదంబు జూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణములీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కస్తూరి రంగు చూడటానికి ఎంత నల్లగా ఉన్నా దాని సువాసన ఎంత బావుంటుందో అలాగే మంచి గుణం కలిగిన
వాడు ఎక్కడ ఉన్నను అతడు ప్రజలచే కీర్తించబడతాడు.


అల్పుడెపుడు పల్కు...


అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఎంతో విలువైన బంగారపు శబ్దము, అంత విలువ లేని కంచు శబ్దము కంటే ఎలా తక్కువ ఉండునో , అలాగే
మంచివారి మాటలు చల్లగా నిరాడంబరంగా ఉంటే, చెడ్డవాడి మాట మాత్రం ఆడంబరంగా ఉంటుంది.


అనగ ననగ రాగ...


అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధర లోన
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

పాడగా పాడగా రాగం వృద్ధి అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే ధృడ సంకల్పంతో పట్టుదలగా చేపట్టిన పనిని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.


ఉప్పుకప్పురంబు...


ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు
చూడ చూడ రుచుల జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

ఉప్పూ, కర్పూరం రెండూ బయటకి చూడటానికి ఒకే రకంగా ఉంటాయి. కానీ వాటి యొక్క రుచులు వేరు.
అలాగే పురుషుల్లో పుణ్య పురుషులు వేరుగా ఉంటారు.